
భూగర్భ కేంద్రాన్ని సందర్శించిన హైడెల్ డైరెక్టర్
దోమలపెంట: టీఎస్ జెన్‌కో హైడెల్ డైరెక్టర్ బాలరాజు మంగళవారం శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల ఆయన జెన్‌కో హైడెల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయనకు కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణ, ఎస్‌ఈ(ఓఅండ్‌ఎం) ఆదినారాయణ, ఎస్‌ఈ(సివిల్) రవీంద్రకుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైడెల్ డైరెక్టర్ మొదట కేంద్రం మొత్తం తిరిగి అన్ని యూనిట్లను పరిశీలించారు. నాలుగో యూనిట్‌కు సంబంధించి చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించి ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందికి సూచనలు తెలిపారు. అనంతరం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, టీజీ స్టేట్ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శులు మదన్‌మొహన్‌రెడ్డి, చరణ్ ఆధ్వర్యంలో ఇంజినీర్లు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా కోవిడ్ 2020 నుంచి జెన్‌కోలో బదిలీలు కొంతవరకే జరుగుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యుత్తు ఉత్పత్తి స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇంజినీర్లు పదేండ్లుగా బదిలీలుకాక కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా వ్యథ చెందుతున్నారని వాపోయారు. కనీసం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు, భార్యాపిల్లలకు దూరంగా, వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉంటున్న ఇంజినీర్లను గుర్తించి వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, బదిలీలు త్వరతిగతిని చేపట్టాలని విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారానికి సీఎండీ దృష్టికి తీసుకెళ్తానని హైడెల్ డైరెక్టర్ తెలిపినట్లు ఇంజినీర్లు చెప్పారు. అంతకుముందు ఇంజినీర్ల సంఘం నాయకులు, ఇంజినీర్లు హైడెల్ డైరెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.