
హైదరాబాద్‌లో ‘ఖిల్లా’ వాసి అనుమానాస్పద మృతి
ఖిల్లాఘనపురం: హైదరాబాద్‌లో ఖిల్లాఘనపురం మండల కోతులకుంట తండాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హన్మంతు(38) తనభార్య జమున కుమారుడు రవితోపాటు హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం హన్మంత్ తను నివాసం ఉంటున్న ప్రాంతానికి సమీపంలో గొంతు తెగి రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు గమనించి అప్పులు ఎక్కువై ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మృతదేహాన్ని అక్కడి నుంచి సొంత గ్రామ మైన కోతులకుంట తండాకు సాయంత్రం తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా గోపన్‌పల్లి ప్రాంతానికి చెందిన పోలీసులు ఖిల్లాఘనపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొత్తకోట సీఐ రాంబాబు పర్యవేక్షణలో మండల ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జయన్న సిబ్బందితో తండాకు చేరుకున్నారు. మృతదేహాన్ని వచ్చిన అంబులెన్సులోనే తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. మృతదేహం మెడకు కత్తిగాట్లు ఉండటంతోపాటు హన్మంతు మృతికి సంబందించిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చేయడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తండావాసులు చర్చించుకుంటున్నారు. మృతికి కారణం ఏమై ఉంటుందని వారు ప్రశ్నించుకుంటున్నారు.
మృతదేహాన్ని తండాకు తీసుకురాగా..
తిప్పి పంపిన పోలీసులు

హైదరాబాద్‌లో ‘ఖిల్లా’ వాసి అనుమానాస్పద మృతి