
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్‌కు 142 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తు అర్జీదారులకు సమాచారం తెలియజేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ వసతి గృహా లు, కేజీబీవీలు, అంగన్‌వాడీలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలును ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండల అధికారులతో పర్యవేక్షణ చేయాలన్నారు. హాస్టళ్లు, అంగన్‌వాడీల్లో సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, పరిశుభ్రత తదితర కార్యక్రమాలు పర్యవేక్షించి రిపోర్టు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2025 కార్యక్రమం కింద గ్రామాలకు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించేలా సిటిజన్ ఫీడ్ బ్యాకప్ ద్వారా తెలిపేలా అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఆర్‌డీఓ నర్సిములు, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.