
బాధితులకు న్యాయం అందించాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ దగ్గరకు వచ్చే బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంతో స్వీకరించి, వినతులను సమగ్రంగా పరిశీలించి.. అవసరమైన విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలన్నారు. ప్రజలలో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి వాటి పరిష్కారం కోసం నిత్యం సమీక్ష చేసుకోవాలన్నారు.
డిజిటల్ పద్ధతిలో జరిమానాలు
వసూలు చేయాలి
వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు చేయడం, జరిమానాలు విధించడం నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, వాహనాల జరిమానా వసూళ్లు తదితర అంశాలను తనిఖీలు చేశారు. ట్రాఫిక్ క్రమపద్దతులను పాటించడంలో సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై సీఐ దగ్గర ఆరా తీశారు. ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ పద్ధతిలో జరిమానాలు వసూలు చేయాలని, ప్రతి ఒక్కరికి రశీదు తప్పక ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ పాయింట్లలో సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని, పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి పాల్గొన్నారు.