
బాల కార్మికులను గుర్తించాలి
మహబూబ్‌నగర్ క్రైం: బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం సూచించారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పిపోయిన చిన్నారులతో పాటు పలు రకాల కార్మాగారాల్లో పనిచేస్తున్న బాలబాలికలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి.. వారితో పని చేయిస్తున్న యాజమానులపై పీడీ యాక్ట్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు అవసరం అయితే కౌన్సెలింగ్ నిర్వహించి కేర్ హోమ్‌కు తరలించాలన్నారు. బాలకార్మికులు కన్పిస్తే డయల్ 100 లేదా 1098 టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ నెల రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం తనిఖీలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ నయిముద్దీన్, ఏస్టర్ గ్రేస్, డెమో మంజుల, డీసీపీఓ నర్మద, ఎస్‌ఐ కుర్మయ్య, ఉమెన్ ఎస్‌ఐ సుజాత పాల్గొన్నారు.