
నీటి గుంతలో పడి మహిళ మృతి
ఊర్కొండ: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని ఊర్కొండపేటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన చిక్కొండ కోటయ్యకు ఊర్కొండపేట శివారులో పొలం ఉంది. ఆదివారం ఆయన పొలంలో గుంటుక తోలుతుండగా భార్య చిక్కొండ పద్మమ్మ (45) అతడి వెంటే ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తుండేది. నీళ్లు తీసుకురావడానికి గుంత వద్దకు వెళ్లిన పద్మమ్మ ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయింది. చాలా సమయం వరకు తిరిగి రాకపోవడంతో కోటయ్య వెళ్లి చూడగా నీటిలో కనిపించింది. పరిసర పొలాల రైతుల సాయంతో బయటకు తీసి పరిశీలించగా పద్మమ్మ అప్పటికే మృతిచెందింది.
కృష్ణానదిలో పడి
యువకుడు మృతి
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న కృష్ణానదిలో పడి కర్నూలుకు చెందిన భరత్ (30) మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. భరత్ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం పర్యాటక ప్రాంతమైన సోమశిలకు కారులో వచ్చాడు. నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. తోటి స్నేహితులు కేకలు వేసి అక్కడ ఉన్న కొందర్ని పిలిచారు. వారు వచ్చి నదిలోకి దిగి భరత్‌ను ఒడ్డుకు తీసుకొచ్చి వెంటనే కొల్లాపూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భరత్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
లారీ, బైక్ ఢీ :
యువకుడి దుర్మరణం
దేవరకద్ర రూరల్: లారీ, బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దేవరకద్రకు చెందిన కాటం నవీన్‌గౌడ్ (20) మన్యంకొండ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ హౌస్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. రోజులాగే విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్‌బంక్ దగ్గర లారీ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలంటూ మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ నాయకులు భూట్టో రాము, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేయగా భగీరథ కంపెనీ హెచ్‌ఆర్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.