
ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేయాలి
కొత్తకోట: ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పరిమితి లేని క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట పట్టణంలోని తపస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించడంతో పాటు నూతన పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని, జీహెచ్‌ఎంసీ, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. అదే విధంగా కేజీబీవీ ఉద్యోగుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలన్నారు. గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్‌గౌడ్, గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.