
పోలీసులా.. మజాకా
కోస్గి: పోలీసులకు ఎవరైనా దొంగ పట్టుబడితే పూర్తిస్థాయిలో విచారించి చోరీ సొత్తు రికవరీ చేయాలి. మరోసారి చోరీకి పాల్పడకుండా చర్యలు చేపట్టాలి. కానీ కోస్గి పోలీసుల నిర్వాహకంతో ఓ దొంగ యథేచ్ఛగా మరో చోరీకి పాల్పడ్డాడు. అచ్చం సినీ స్టోరీని తలపించే ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. తాగిన మైకంలో ఉన్న ఓ వ్యక్తి ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి కోస్గికి ఆటోలో వచ్చాడు. స్థానికంగా పాత సామగ్రి కొనుగోలుచేసే రఫి అనే వ్యాపారి వద్దకు అతడు వెళ్లి తన ఆటో అమ్ముతానని చెప్పాడు. అయితే ఆటో కొత్తగానే ఉండటంతో అనుమానం వచ్చిన సదరు వ్యాపారి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆటో అమ్మేందుకు వచ్చిన వ్యక్తిని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి.. ఆటో నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. సంబంధిత ఆటో మహబూబ్‌నగర్‌లో చోరీకి గురైందని.. యజమాని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు నిర్ధారించుకొని అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటోను కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే పట్టుబడిన దొంగకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తీసుకోకుండానే తాగిన మైకంలో ఉన్నాడంటూ వదిలేశారు. అతడు దర్జాగా కోస్గి ఆటో స్టాండ్‌కు చేరుకొని అక్కడ నిలిపి ఉంచిన మరో ట్రాలీ ఆటోతో పరార్ కావడం కలకలం రేపింది.
చోరీ చేసిన ఆటోతో పట్టుబడిన దొంగ
తాగిన మైకంలో ఉన్నాడంటూ వదిలేసిన కోస్గి పోలీసులు
మరో ఆటోతో ఉడాయించిన నిందితుడు
సామాజిక మాధ్యమాల్లో వైరల్.. అప్రమత్తమైన ఆటో డ్రైవర్లు
హన్వాడ సమీపంలో ఆటోతో సహా పట్టివేత
ఆటో దొంగ విషయమై ఎస్‌ఐ బాల్‌రాజ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. సీఐ సైదులును సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన సైతం అందుబాటులోకి రాలేదు. స్టేషన్ ఇన్‌చార్జిగా ఉన్న ఏఎస్‌ఐ ఆంజనేయులును ఈ విషయమై అడగగా.. తాగిన మైకంలో ఉండి వివరాలు చెప్పకపోవడంతో ఆటోను స్వాధీనం చేసుకొని అతడిని వదిలేశామన్నారు. ఇక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులకు అప్పగిస్తామన్నారు. ఏదేమైనా స్థానిక పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కోస్గి పోలీసులా.. మజాకా అంటూ చర్చించుకోవడం కనిపించింది.

పోలీసులా.. మజాకా