
‘ర్యాలంపాడు లీకేజీల పాపం గత ప్రభుత్వానిదే’
గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన ర్యాలంపాడు జలాశయం ఆనకట్ట అడుగుభాగం, కుడి, ఎడమ తూముల అడుగు భాగంలో లీకేజీలు ఏర్పడటం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలకులదేనని మాజీ ఎమ్మెల్యే డీకే భరత్‌సింహరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన ర్యాలంపాడు, జూరాల జలాశయాలను సందర్శించి మాట్లాడారు. ర్యాలంపాడు జలాశయం నిర్మాణ సమయంలో నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తున్నారంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, ఆ క్రమంలో తనపై అవినీతి ఆరోపణలు కూడా చేశారన్నారు. తాము ఇచ్చిన ఆధారాలతో విచారణ చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనుల బిల్లులను నిలిపివేసిందని తెలిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లులు విడుదల చేసి తమకు రావాల్సిన కమీషన్లు దండుకుందని ఆరోపించారు. ర్యాలంపాడు జలాశయం నెట్టెంపాడు ప్రాజెక్టుతో పాటు కొత్తగా నిర్మిస్తున్న గట్టు లిఫ్ట్‌కు సైతం గుండె లాంటిదని.. అంతటి ప్రాధాన్యత ఉన్న జలాశయం లీకేజీలతో పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. మళ్లీ నిర్మాణం చేయాలంటే సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని.. ఇంత పెద్ద తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని రికవరీ చేయాలన్నారు. అదేవిధంగా త్వరితగతిన మరమ్మతు చేసి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని కోరారు. జూరాల ప్రాజెక్టు నిర్వహణలో అప్పటి బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని.. దీని ఫలితమే ప్రాజెక్టు గేట్ల రోప్‌లు తెగిపోయి ప్రమాదంలో పడిందన్నారు. రోప్‌లు తెగిపోవడం, రబ్బర్ సీల్స్ దెబ్బతినడం స్పష్టంగా కనిపిస్తుంటే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటనలు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని జూరాల మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టి కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంజీవ్ భరధ్వాజ్, మీర్జాపురం రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.