
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్‌ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు.
ప్రాజెక్టులకు రక్షణ లేదు..
రాష్ట్రంలో ప్రాజెక్టులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. జూరాల క్రస్ట్ గేట్ల రోప్‌లు తెగుతున్నాయంటే.. వాటితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని మాట్లాడే వ్యక్తి నీటి పారుదల శాఖ మంత్రి కావడం మన దురదృష్టం అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తూ రైతులకు సాగునీరు అందించేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు పంపడమే పనిగా పెట్టుకుందని.. అలాంటి పాలకులపై ప్రజలు తిరగబడుతున్నారని, ప్రజలు మరోమారు బీఆర్‌ఎస్ పాలనే రావాలంటూన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.