
దేవరకద్రకు కోర్టు మంజూరు
దేవరకద్ర రూరల్: ఎట్టకేలకు దేవరకద్రలో కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం ఆదివారం జారీ చేసింది. అయితే 2022లో స్థానికంగా కోర్టు ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నట్లు గత ప్రభుత్వం గుర్తించినా ఏర్పాటుకు మాత్రం నోచుకోలేకపోయింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. స్వతహాగా న్యాయవాది అయిన మధుసూదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో దేవరకద్రలో కోర్టు ఏర్పాటుకు కృషి చేయాలని స్థానికులు, కక్షిదారులు ఆయనను కోరారు. ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి కోర్టు మంజూరు చేయాలని పలుమార్లు కోరగా.. తాజాగా దేవరకద్రకు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు నూతనంగా 9 కోర్టులను మంజూరు చేయగా, అందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి దేవరకద్రలో కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తప్పనున్న ఇబ్బందులు..
దేవరకద్రలో కోర్టు ఏర్పాటుతో నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి. గతంలో కేసుల కోసం కక్షిదారులు 65– 70 కిలోమీటర్లు ప్రయాణించి ఆత్మకూర్, గద్వాల కోర్టులకు వెళ్లేవారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రం ఏర్పాటు అనంతరం ఇక్కడి కేసులన్నీ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కోర్టులకు బదిలీ చేశారు. దీంతో దేవరకద్ర, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, కౌకుంట్ల మండలాల పరిధిలో నుంచి 2500– 3000 వరకు సివిల్, క్రిమినల్ కేసులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా కోర్టు ఏర్పాటుతో ఆయా మండలాల కక్షిదారులకు, ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తప్పనున్నాయి.
జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

దేవరకద్రకు కోర్టు మంజూరు