
అలరించిన ‘పాటల పల్లకీలో’..
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో ఆదివారం నిర్వహించిన ‘పాటల పల్లకీలో– 12 గంటలు పాలమూరులో ’అనే కార్యక్రమం అలరించింది. కళాకారులు తెలంగాణ ఉద్యమ, జానపద పాటలు పాడడంతోపాటు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ర్యాలీగా కళాభవన్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా పాటల పల్లకీలో కార్యక్రమం కొనసాగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కళాకారులకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కళాకారుల పాట లేనిదే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. ఉద్యమంలో కళాకారుల పాత్ర విలువ కట్టలేనిదన్నారు. కవులు, కళాకారులు, గాయకులు వారి పాట, ఆటలతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఊరు, వాడా అనే తేడా లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కళాకారులు అందరూ సఫలీకృతం అయ్యారన్నారు. ప్రజా ప్రభుత్వం కళాకారులపట్ల సానుకూల దృక్పథంతో ఉందన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని ఏకం చేసి హైదరాబాద్‌లో ధూంధూం నిర్వహించాలని, మీ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిషోర్, టీపీసీసీ సాంస్కృతిక సేన అధ్యక్షుడు చక్రాల రఘు, జిల్లా కళాకారులు టంకర శ్రీనివాసులు, ఎదిర నర్సింహులు, బాలస్వామి, రమాదేవి, డప్పుస్వామి, మురళీ, జక్క గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన కళాకారులు