
‘లేనిపోని ఆరోపణలు చేస్తే సహించం’
జడ్చర్ల: ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇస్తూనే.. ఆయనపై తిరిగి ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం తమపై బురద జల్లితే ఊరుకోబోమన్నారు. సిగ్నల్‌గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి అంబేడ్కర్ చౌరస్తాలో డివైడర్ కటింగ్ ద్వారా పాత బస్టాండ్ వైపు ఆర్టీసీ బస్సులు వెళ్లే పరిస్థితి స్పష్టంగా ఉండగా.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నెహ్రూ చౌరస్తాలో యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అలాగే ఎర్రగుట్టలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో డబ్బులు తీసుకుని ఇచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అందులో ఉన్న అర్హులకు ఇళ్లు ఇవ్వాలని లేకపోతే ఆందోళన చేస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రి వద్ద తమ కుటుంబీకులపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే తనకు పోలీస్ ఎస్కార్ట్ వద్దంటూనే తన తల్లికి పోలీస్ ఎస్కార్ట్ ఇస్తూ అధికారిక కార్యక్రమాల్లో తల్లి, సోదరుడిని భాగస్వామ్యం చేస్తూ రాజరిక పాలనను తలపిస్తున్నాడని ధ్వజమెత్తారు. తాను తమ పార్టీకి చెందిన వారు ఒక్క గుంట భూమి ఎక్కడా కబ్జా చేయలేదని అలా చేస్తే నిరూపించాలని సవాల్ విసిరారు. నల్లకుంటను ఎమ్మెల్యే కబ్జా పెట్టారని ఆరోపించారు. రంగారెడ్డిగూడలో ఆలయ భూముల ఆదాయం ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాను అరికడ్తామంటూనే యథేచ్ఛగా హైదరాబాద్‌కు తరలించారని దుయ్యబట్టారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలకు ఇంకా ఎందుకు పెంచలేదన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నంద, జ్యోతి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.