
‘ఫేక్ మెసేజ్’తో రూ.57,700 మాయం
అడ్డాకుల: ‘ఎల్‌ఐసీ డబ్బులు రూ.24 వేలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేశాం.. మరో రూ.84 వేలు పంపిస్తాం’ అంటూ ఓ సైబర్ మోసగాడు రూ.57,700 కాజేశాడు. బాధితుడు మురళి కథనం మేరకు.. మండలంలోని పొన్నకల్‌కు చెందిన లక్ష్మి హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. శుక్రవారం మధ్యాహ్నం మూసాపేటలో ఉండే తల్లి కొండమ్మ వద్దకు వచ్చింది. రూ.24 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తప్పుడు సందేశం పంపించి ఫోన్ చేసి మాట్లాడాడు. రూ.24 వేలు ఎల్‌ఐసీ డబ్బులు జమ చేశామని.. మరో రూ.84 వేలు పంపిస్తామని, మరో బ్యాంకు ఖాతా నంబర్ పంపించాలని అడిగాడు. తనకు వివరాలు తెలియవని.. కుమారుడు శివకుమార్‌కు ఫోన్ చేయాలని అతడి నంబర్ చెప్పింది. తర్వాత శివకుమార్‌కు ఫోన్ చేసిన నేరగాడు వివరాలన్నీ చెప్పి ఖాతానంబర్ అడిగాడు. తన తల్లి మూసాపేటలో ఉంటుందని.. అక్కడ ఉండే ఆటో మెకానిక్ మురళి పేరు చెప్పి అతడికి ఫోన్ చేశాడు. ఎల్‌ఐసీ ఏజెంట్ డబ్బులు వేస్తాడు.. నీ బ్యాంకు ఖాతా వివరాలు అతడికి చెప్పమని కోరాడు. వెంటనే నేరగాడు మురళికి ఫోన్‌చేసి వివరాలు తీసుకుని మొదట అతడి ఖాతాలో ఉన్న రూ.7,700 కాజేశాడు. తర్వాత మురళి ఆత్మకూర్‌లో ఉండే తోడల్లుడు రాములుకు ఉదయం రూ.50 వేలు పంపడంతో దాన్ని గుర్తించి రాములు అకౌంట్‌కు వేస్తానంటూ అతడి నంబర్ తీసుకున్నాడు. రాములుకు ఫోన్‌చేసి గూగుల్ పే ద్వారా కొంత నగదు పంపినట్లుగా టైప్ చేయాలని కోరాడు. రాములు రూ.5000 టైప్ చేయగా వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి ఖాళీ అయ్యాయి. తర్వాత మిగిలిన రూ.45 వేలు కూడా కాజేశాడు. మొత్తంగా రాములుతో రూ.50 వేలు, మురళితో రూ.7,700 సైబర్ నేరగాడి పాలయ్యాయి. వెంటనే బాధితుడు మురళి మూసాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరంపై విచారణ చేయిస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.వేణు తెలిపారు.