
పనిచేయించుకున్నారు.. పోస్టు లేదు పోమ్మన్నారు!
గండేడ్: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రారంభం నుంచి ఓ మహిళతో పనిచేయించుకున్నారు. తీరా ఐదు నెలలు గడిచిన తర్వాత పోస్టు లేదు.. వెళ్లి పొమ్మన్నారు. జీతం అడిగితే తమకు తెలియదంటూ దాటవేస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మబాద్‌కు చెందిన శశికళ గత జనవరిలో గండేడ్‌లో కొత్తగా ఏర్పాటైన కేజీబీవీలో వంటమనిషిగా చేరారు. అప్పట్లో ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు వర్కర్లను నియమించారు. అయితే అప్పటి నుంచి శశికళ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ వంట చేసేది. ఈ క్రమంలోనే వేసవి సెలవులు వచ్చాయి. విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయినా వర్కర్లు పాఠశాలకు రెగ్యులర్‌గా రావాలని చెప్పడంతో మిగతా వారితో పాటు శశికళ నిత్యం మహమ్మదాబాద్ నుంచి విధులకు హాజరయ్యేది. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత కూడా యథావిధిగా విధులకు హాజరై విద్యార్థులకు వంటావార్పు చేస్తూ వచ్చింది. అయితే ఈ నెల 17 తర్వాత ఎస్‌ఓ శివలీల వర్కర్ల జాబితాలో నీ పేరు లేదు.. రావొద్దని శశికళకు చెప్పడంతో ఖంగుతింది. ఇన్ని రోజులు పనిచేయించుకొని ఇలా చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించగా.. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని.. మీరు రావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే తాను పనిచేసిన ఐదు నెలల జీతమైనా ఇవ్వాలని అడిగితే తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. బయట పనిచేసుకున్నా కనీసం ఇల్లు గడిచేదని వాపోయారు. ఈ విషయమై శశికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓను విచారణకు ఆదేశించారు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.
న్యాయం చేయాలంటూ కేజీబీవీ వంటమనిషి వేడుకోలు
కనీసం పనిచేసిన ఐదు నెలల జీతం ఇవ్వాలని మొర