
క్రషర్ ప్లాంట్ వద్ద హైడ్రామా
● ఆంజనేయులు మృతదేహంతో ఆందోళన
● పరిహారం చెల్లించేందుకు
అంగీకరించడంతో సద్దుమణిగిన గొడవ
గట్టు: మండలంలోని సల్కాపురం, జోకన్‌గట్టు గ్రామాల సమీపంలోని క్రషర్ ప్లాంట్ వద్ద గురువారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. తారాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు (63) క్రషర్ ప్లాంట్ వద్ద మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబ సభ్యులు క్రషర్ ప్లాంట్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండా ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జోకన్‌గట్టు, తారాపురం, గట్టు, సల్కాలపురం గ్రామాలకు చెందిన వారు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ఒకానొక దశలో క్రషర్ ప్లాంట్ నిర్వాహకులు పరిహారం చెల్లించేందుకు నిరాకరించడంతో ఆందోళనకారులు క్రషర్ ప్లాంట్‌పైకి రాళ్లు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు బాధిత కుటుంబ సభ్యులకు క్రషర్ ప్లాంట్ నిర్వాహకులు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఆంజనేయులు మృతి ఘటనపై అతడి కుమారుడు గుడిసె చిన్న వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. చపాతి గొంతులో ఇరుక్కోవడంతో మృతిచెందినట్లు పోస్టుమార్టం అనంతరం వైద్యులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.