
పింఛన్ దరఖాస్తులు పరిష్కరించాలి
వనపర్తి: జిల్లాలో 487 చేయూత పింఛన్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని.. వారంలోగా పరిష్కరించాలని గ్రామీణాభివృద్ధిశాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాలరావు, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ దరఖాస్తులు ఎలా పరిష్కరించాలి.. లోటు పాట్లపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, పుర కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 73 వేల మందికి ప్రతి నెల రూ.17 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో సరైన నియంత్రణ లేక లబ్ధిదారు చనిపోయిన తర్వాత కూడా పింఛన్ చెల్లిస్తున్నారని.. ఎవరైనా లబ్ధిదారు చనిపోతే వారి స్థానంలో భార్య లేదా భర్త దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చనిపోయిన వారివి తొలగించి కొత్త వారికి వారం రోజుల్లో అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకునే అవసరం లేదని.. వివరాలు తెలుసుకొని అందజేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, పుర కమిషనర్లపై ఉందన్నారు. నిబంధనలు తెలియక కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోలేదని పెండింగ్‌లో ఉంచడం సరికాదని.. మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చేటప్పుడే ఫారం–7 పూరించి ఓటరు జాబితా నుంచి మరణించిన వ్యక్తి పేరు తొలగించాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబంలో కుటుంబ పోషకుడు చనిపోతే రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తారని.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొన్నారు.