
‘ఎమర్జెన్సీ’తో ప్రజాస్వామ్య హక్కులకు భంగం
వనపర్తి టౌన్: ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి వరకు సుమారు 21 నెలల పాటు విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైన రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్, అనంతప్ప, లక్ష్మణ్‌ను ఆయన సన్మానించి అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఏటా జూన్ 25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం (యాంటీ ఎమర్జెన్సీ డే) జరుపుకొంటామని, ఆ సమయంలో ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను జైలు పాలు చేయడంతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు విధించిందని, పత్రికలపై ముందస్తు సెన్సార్‌షిప్ ప్రవేశపెట్టారని, ఏ వార్తనైనా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి ఉండిందని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా అనేక సంస్థలను నిషేధించారని.. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ పెత్తనం నడిచిందని, నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయని, రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలు నాటి, ప్రతి నాయకుడు ఒక మొక్క నాటాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర మహిళా జాయింట్ ట్రెజరర్ జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు, బండారు కుమారస్వామి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, సుమిత్రమ్మ, చిత్తారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.