
అంగన్‌వాడీలో భోజనం బాగోలేదు
గండేడ్: ‘భోజనం బాగోలేదు.. గుడ్డు పెట్ట లేదు.. కనీసం పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోపోతే ఎలా?’ అంటూ కలెక్టర్ విజయేందిర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె గండేడ్ మండలం సల్కర్‌పేట అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చిన్నారులకు అందించే పోషకాహారం, మెనూ గురించి ఆరా తీశారు. మెనూ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 1, 2, 3 తరగతి గదుల్లో బోధనను పరిశీలించారు. మూడో తరగతిలో ఉపాధ్యాయులు గణితం బోధిస్తుండగా విద్యార్థుల వద్దకు వెళ్లి కూడికలపై ప్రశ్నలు వేశారు. ఒకటో తరగతి విద్యార్థులతో అక్షర మాల చదివించారు. ప్రాథమిక భావనలు, కొత్త పదాలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉన్నత పాఠశాలలోకి వెళ్లి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. భోజనం నాసిరకంగా ఉందని, చారు నీళ్లలాగా పెడితే విద్యార్థులు ఎలా తింటారని ఏజెన్సీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయి, పరిహారం అందని రంగారెడ్డిపల్లి, సల్కర్‌పేట్ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూమి ఎక్కువ ఉంటే పరిహారం తక్కువ వచ్చినట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతోపాటు పరిహారం మొత్తాన్ని కూడా పెంచాల ని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు అన్ని విషయాలు పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జునరావు, ఆర్‌ఐ యాసిన్, జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా?
నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన
కలెక్టర్ విజయేందిర బోయి