
పనిలో నైపుణ్యం సాధించాలి: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో నైపుణ్యం సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఆర్‌పీలు, ఎస్‌హెచ్‌జీలకు కొన్ని రోజులుగా ‘నవరత్నాలు’ ఆధ్వర్యంలో సెట్విన్ సహకారంతో ఉచిత కంప్యూటర్ శిక్షణనిస్తున్నారు. గురువారం వారికి ఎమ్మెల్యే స్టడీ మెటీయల్ అందజేసి మాట్లాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల నిర్వహణ కంప్యూటరీకరించనున్నారని, ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన అప్రెంటిస్‌షిప్–జాబ్‌మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు పవన్, పావనిలను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు చేపట్టే ఇంటర్వ్యూలలో ఎక్కువ మంది విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జి.అరుణ కోసం రూ.50 వేలు, తస్లింబేగం కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీలు ఆయా కుటుంబసభ్యులకు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రీ, ఖాజాపాషా, బొట్టు శ్రీను, రాష్ట్ర పరిశీలకులు నండూరి శ్రీనివాస్, మహబూబ్‌నగర్ ఫస్ట్–నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్, సెట్విన్ కో–ఆర్డినేటర్ విజయ్‌కుమార్, ఫ్యాకల్టీ రోజారాణి, కళాశాల ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు , తదితరులు పాల్గొన్నారు.