
ఎనిదేళ్లయినా మోక్షం కలగలే..
దేవరకద్ర: నియోజకవర్గ కేంద్రం నుంచి 17 కిలోమీటర్లతో 44 వ జాతీయ రహదారిని అనుసంధానం చేసే లక్ష్మీపల్లి, వేముల డబుల్ రోడ్డు పనులు ఎనిమిదేళ్లైనా పూర్తి కాలేదు. డబుల్ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేయడంతో పాత రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టట్లేదు. దీంతో రోడ్డంతా గుంతలమయంగా మారడంతో వాటిని తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. చిన్న కార్లు ఆ రోడ్డుపై వెళ్లలేక పలుమార్లు గుంతల్లో ఇరుక్కున్న ఘటనలు ఉన్నాయి.
4 కిలోమీటర్లు పూర్తి
గత ప్రభుత్వ హయాంలో 44వ జాతీయ రహదారి వేముల స్టేజీ నుంచి వేముల, లక్ష్మీపల్లి, హజిలాపూర్, చౌదర్‌పల్లి మీదుగా 167వ జాతీయ రహదారిని కలుపుతూ చౌదరపల్లి స్టేజీ వరకు 17 కిలో మీటర్ల డబుల్ రోడ్డు వేసేందుకు రూ. 23.36 కోట్లు మంజూరు చేశారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించారు. వేముల స్టేజీ నుంచి వేముల గ్రామం వరకు, అక్కడి నుంచి లక్ష్మీపల్లి వరకు 4 కిలో మీటర్ల మేర డబుల్ రోడ్డు పనులు పూర్తి చేశారు. అది కూడా మధ్యలో బీటీ వేయకుండ కొన్ని చోట్ల కంకర వేసి వదిలేశారు. మిగతా 13 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభం కాలేదు. చేసిన పనికి సరిగ్గా బిల్లులు రాకపోవడం వల్లనే పనులు నిలిచినట్లు వినిపిస్తున్నా.. ఆర్‌అండ్‌బీ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అధికారులు ఇప్పటికై నా రీటెండర్లు వేసి పనులు పూర్తి చేస్తే వాహనదారుల ఇబ్బందులు తప్పుతాయని పలువులు అంటున్నారు.
మరమ్మతు కరువు
డబుల్ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించడంతో పాత రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో రోడ్డంతా గుంతలమయంగా మారింది. డబుల్ రోడ్డుతో వేస్తే అంతా సర్దుకుంటుందని భావించిన అధికారులు ఏళ్ల తరబడి మరమ్మతులపై దృష్టి సారించడం లేదు. డబుల్ రోడ్డు వేయకపోయినా పర్లేదు కానీ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చండి మహాప్రభో అని వాహనదారులు అధికారులను వేడుకుంటున్నారు.
ఎన్‌హెచ్‌ఏ 44 టు ఎన్‌హెచ్‌ఏ 167 డబుల్ రోడ్డు అనుసంధానం
పనులకు గ్రహణం
2017 లో రూ. 23.36 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

ఎనిదేళ్లయినా మోక్షం కలగలే..