మహమ్మదాబాద్: ‘రుణాలే తీసుకోలే.. ఎలా చెల్లిస్తాం’ అని మహిళా సంఘాల సభ్యులు డీఆర్‌డీఓ, బ్యాంక్ అధికారులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. మండలంలోని మహి ళా సమాఖ్య సంఘాల నుంచి రుణాల రికవరీ లేకపోవడంతో గురువారం మహమ్మదాబాద్ మహిళా సమాఖ్య కార్యాలయంలో డీఆర్‌డీఓ ఏపీడీ శారద, ఏపీఎం సునీత, మహమ్మదాబాద్ ఎస్‌బీహెచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్లు కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో వీఏఓలను, సీసీలు, ఇతర మహిళా సంఘాల సభ్యులను పిలిపించి మాట్లాడారు.
రుణాలు ఎందుకు చెల్లించడం లేదని సభ్యులను ప్రశ్నించారు. సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ తాము తీసుకోని రుణాలను ఎందుకు చెల్లిస్తామని ప్రశ్నించారు. కొందరు వీఏఓలు తమకు తెలియకుండా రుణాలు తీసుకున్నట్లు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే నెల వరకు పూర్తిస్థాయిలో రికవరీ చేయాలని, అక్రమాలు బయటపడితే చర్యలు తీసుకుంటామని, అందుకు బాధ్యులయిన వారిని తొలగిస్తామని ఏపీడీ శారద హెచ్చరించారు.

‘రుణాలే తీసుకోలే.. ఎలా చెల్లిస్తాం’