
ప్రాజెక్టుల నిర్వహణపై అవగాహన లేని ప్రభుత్వం
అమరచింత: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మాజీ మంత్రి ఆవంచ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్లును పరిశీలించి మాట్లాడారు. 4, 31వ గేట్ల రోప్‌లు రెండు వైపులా తెగిపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురిసి జలాశయానికి వస్తున్న వరదను దిగువకు వదిలే పరిస్థితులు లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. వేసవిలోనే ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, గ్రీస్ పూయడం, రోప్‌లు సరిచేయడం వంటి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రాజెక్టులు సందర్శించి అధికారులతో పనులు చేయించే సత్తా గత ప్రభుత్వానికే ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణలపై ఏ మాత్రం అవగాహన లేదని.. అందుకే ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు. వరద నీటిని ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన సైతం లేదన్నారు. జూరాల మరమ్మతులో జరిగే అలసత్వంపై నీటిపారుదలశాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.