
ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ–2
కల్వకుర్తి టౌన్: భూ తగాదాల విషయంలో స్టేషన్ బెయిల్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ–2ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామానికి చెందిన నంబి ఆంజనేయులు, నంబి వెంకటయ్యలకు మధ్య భూమి విషయమై కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 23న భూమిని దున్నే సమయంలో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ విషయమై ఇద్దరూ పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంకటయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో వెంకటయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఈ కేసులో స్టేషన్ బెయిల్ వస్తుందని చెప్పి అతనితో రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఎస్‌ఐ–2 రామచందర్‌జీ డిమాండ్ చేయగా.. రూ.10 వేలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు బుధవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐ–2 రామచందర్‌జీపై కేసు నమోదు చేశామని, గురువారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదే విషయమై బాధితుడు సైతం మీడియాతో మాట్లాడుతూ కేసు నమోదు చేసిన వెంటనే స్టేషన్‌కు పిలిపించి తన తప్పు లేకున్నా అసభ్య పదజాలంతో దూషించడమే గాక, డబ్బులు డిమాండ్ చేయడంతోనే ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదని, ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని డీఎస్పీ బాలకృష్ణ కోరారు. పట్టుబడిన ఎస్‌ఐ రామచందర్‌జీకి ఏడాది మాత్రమే సర్వీసు ఉందని అధికారులు పేర్కొన్నారు.
భూ వివాదంలో స్టేషన్ బెయిల్ కోసం డబ్బులు డిమాండ్
కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ ఆవరణలో
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు