
లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో మొదటిసారి జూన్ 25 నాటికి 125 మి.యూ. ఉత్పత్తి సాధించామని.. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారని జెన్‌కో సీఈ కల్లూరి రామసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలను సందర్శించి సిబ్బందిని అభినందించి మాట్లాడారు. ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికి మించి ఉత్పత్తి చేపట్టాలని అధికారులకు సూచించారు. మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం గురించి విద్యుదుత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 30 నాటికి మూడో యూనిట్ మరమ్మతు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. కర్ణాటక నుంచి వరద భారీగా చేరుతుండటంతో జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతుందని వివరించారు. బుధవారం ఎగువ 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 58.687 మి.యూ, దిగువ 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 66.961 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు శ్రీధర్, సురేష్, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు పవన్‌కుమార్, రూపేష్, రాజు, ధర్మారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, దర్బార్‌వలీ, ఏఈలు పాల్గొన్నారు.