
‘రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు’
మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేశంలో నిర్బందాలు, నియంతృత్వాలకు కాలం చెల్లిందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 18 నెలలపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు చేపడితే.. సీపీఎం నాయకులు, కార్యకర్తలను జెలులో అక్రమంగా నిర్బంధించారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని అమలు పర్చకుండా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శివర్గ సభ్యురాలు పద్మ, నాయకులు చంద్రకాంత్, రాజ్‌కుమార్, దీప్లానాయక్, జగన్ పాల్గొన్నారు.