
అడ్డగోలుగా డిప్యుటేషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యా శాఖలో ఉన్నతాధికారులు మారినా.. ప్రభుత్వాలు మారినా.. అక్కడ పనిచేసే వారి తీరు మాత్రం మారడం లేదు. గత డీఈఓపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చి.. చివరికి ఏసీబీకి చిక్కినా ప్రస్తుత అధికారుల్లో మార్పు రాకపోవడం కొసమెరుపు. కావాల్సిన వారికి, తమకు అనుకూలమైన వారికి అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో అప్పటి డీఈఓ సుమారు 95 వరకు డిప్యుటేషన్లు ఇచ్చారు. అయితే వీటిలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాటిని వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అనేక మార్లు విన్నవించినా ప్రస్తుత డీఈఓ పట్టించుకోకుండా అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారు. అయితే వచ్చే నెల 15 వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అక్రమ డిప్యూటేషన్లకు తెరలేపడం వివాదాస్పదంగా మారింది.
అక్కడ ప్రమోషన్.. ఇక్కడ పోస్టింగ్
డీఈఓ కార్యాలయంలో రెండేళ్లుగా సీఎంఓగా పనిచేస్తున్న అధికారిని డీఈఓ అందలమెక్కించడం వివాదాస్పదంగా మారింది. ఆయన సీఎంఓగా బాధ్యతలు స్వీకరించక ముందే రూరల్ మండలంలోని ధర్మాపూర్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉంటూ ఫారెన్ సర్వీస్‌లో డీఈఓ కార్యాలయానికి సీఎంఓగా వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం గతేడాది హెచ్‌ఎంలకు పదోన్నతులు కల్పించగా జెడ్పీహెచ్‌ఎస్ వడ్డేమాన్‌లో హెచ్‌ఎం పోస్టు ఖాళీగా ఉందని అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకున్నారు. అక్కడ సర్వీస్ కనీసం రెండేళ్లు కూడా కొనసాగించకుండా డీఈఓ కార్యాలయంలో సీఎంఓగా కొనసాగుతూనే తాజాగా హెచ్‌ఆర్‌ఏ ప్లేస్ అయిన తాటికొండ హెచ్‌ఎంగా పోస్టింగ్ తీసుకున్నారు. గతంలో పనిచేసిన ధర్మాపూర్ లేదా వడ్డేమాన్‌లలో కొనసాగకుండా తన పరపతి, డీఈఓ అండదండలతో తాటికొండలో పోస్టింగ్ తీసుకోవడం విద్యాశాఖ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని పలువురు డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా పోస్టింగ్ ఆర్జేడీ ఇచ్చారని, తనకేం తెలియదని దాటవేశారు.
జిల్లా విద్యాశాఖలో అధికారుల ఇష్టారాజ్యం
తమకు కావాల్సిన వారిని అందలంఎక్కిస్తున్న వైనం
గత డీఈఓ ఇచ్చిన ఆర్డర్లనే
కొనసాగిస్తున్న ప్రస్తుత అధికారి
వచ్చేనెల 15 వరకు చేపట్టొద్దని నిబంధనలున్నా బేఖాతర్
జిల్లా విద్యాధికారి తీరుపై
ఉపాధ్యాయ సంఘాల మండిపాటు