
3 నెలలు పింఛన్ తీసుకోకుంటే తొలగించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లను క్రమంగా మూడు నెలలు పాటు తీసుకోని పక్షంలో వెరిఫికేషన్ చేసి తొలగించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మున్సిపాలిటీలో ఏడాదికిపైగా బ్యాంకు ఖాతాల నుంచి పెన్షన్ డ్రా చేయని వారు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంశాలపై జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నవన్నీ వారం రోజుల్లో పూర్తిచేయాలన్నారు. జూలై నుంచి ఫేస్ క్యాప్చరింగ్ ద్వారా పింఛన్ పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025లో జిల్లాలోని గ్రామాల ర్యాంకింగ్ మెరుగుపడాలన్నారు. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలకు పారా మీటర్లపై వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి పొడి చెత్త, ఇంకుడు గుంతలు, ఐఈసీ కార్యక్రమాలు, గ్రామం మొత్తం పరిశీలన చేస్తారన్నారు. గత సంవత్సరం గ్రామాల ప్రగతిలో గుజరాత్ తర్వాత తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. జీపీలు ఏ ప్లస్ కేటగిరిలో ఉండేలా అధికారులు కృషిచేయాలన్నారు. ఇందరిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన వాటిని మార్క్ ఔట్ గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సెర్ప్ పింఛన్ డైరెక్టర్ గోపాల్‌రావు, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, డీపీఓ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి విపత్తులు జరగకుండా చర్యలు
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరదల వలన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వలన గత ఐదేళ్లలో నష్టం జరిగిన ప్రాంతాలు, హై రిస్క్ ఏరియాలు గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, సహాయ చర్యలు, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలన్నారు.
అంగన్‌వాడీ బాటపై సమీక్ష
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై జిల్లా సంక్షేమధికారి జరీనాబేగం, సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో అమ్మ మాట– అంగన్‌వాడీ బాటపై కలెక్టర్ విజయేందిర సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, చిన్నారుల హాజరుశాతం పెంచాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు అంగన్‌వాడీలపై పర్యవేక్షణ పెంచాలని చెప్పారు.