
మత్తు పదార్థాలవినియోగాన్ని అరికట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని ఎస్పీ జానకి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ హాల్‌లో డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్–2025లో నషా ముక్త్ భారత్‌లో భాగంగా ఈ నెల నుంచి బుధవారం వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 9 గంటలకు స్డేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు విద్యార్థులతో మాదకద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీస్తామన్నారు. యాంటీ డ్రగ్ కమిటీ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, మెడికల్ కళాశాలల్లో ఎవరైనా డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం, రవాణా ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి సాగు చేయకుండా ఎకై ్సజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులలో మత్తు పదార్థాల బారినపడిన వారిని గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందిస్తే మత్తు పదార్థాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఏఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.