మహబూబ్‌నగర్ క్రైం: మత్తుపదార్థాల నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములై సహకరించాలని ఎస్పీ జానకి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలపై మహా సంకల్పంపై 2,500 మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారి నుంచి యువతను రక్షించడం మనందరి బాధ్యత అని, ఇందులో ప్రతి కుటుంబం, విద్యాసంస్థ, సమాజం భాగస్వామ్యం కావాలన్నారు.
యువతే ఈ దేశ భవిష్యత్ అన్నారు. జిల్లా అంతటా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ప్రతి పోలీస్‌స్టేషన్ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమ కేలండర్ రూపొందించామని చెప్పారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణపై రూపొందించిన వివిధ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, డీఎస్పీ రమణారెడ్డి, డీఐఈఓ కౌసర్ జహార్, టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ ప్రిన్సిపాల్ రాములు, ఐటీ కోర్ టీం ఎస్‌ఐ రవి, మున్సిపల్, పోలీస్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, వలంటీర్లు పాల్గొన్నారు.
28న శ్రీజగన్నాథుడి రథయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో శనివారం శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం నిర్వహించనున్నట్లు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, ఇస్కాన్ ప్రతినిధి వరదరాజు దాసు ప్రభు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్ భక్తి వృక్ష కేంద్రంలో మంగళవారం రథయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ధార్మిక సంస్థల సహకారంతో పాలమూరులో నాలుగోసారి శ్రీజగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
రథయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ కల్యాణ మండపం నుంచి ప్రారంభమై న్యూటౌన్, ఆర్టీసీ బస్టాండ్, అశోక్‌టాకీస్ చౌరస్తా, వన్‌టౌన్, రాంమందిర్, క్లాక్‌టవర్, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, రైల్వేస్టేషన్, శెట్టి కాంప్లెక్స్ మీదుగా తిరిగి కల్యాణ మండపం వరకు చేరుకుంటుందని తెలిపారు. భక్తుల నృత్యాలు, భజనలు, కోలాటాల మధ్య శ్రీజగన్నాథ రథయాత్ర అద్భుతంగా సాగుతుందని, పట్టణ ప్రజలు రథయాత్రకు హారతులతో స్వాగతం పలకాలని కోరారు. కార్యక్రమంలో రాజ మల్లేష్, జి.పాండురంగం, విజయ్ వెంకటేశ్, నత్మల్, కొండప్ప, సురేందర్, మల్లారెడ్డి, మూర్తి, డాక్టర్ మంజుల, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
నేడు మార్కెట్‌కు సెలవు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం సెలవు కారణంగా ఉల్లి వేలం, ధాన్యం క్రయవిక్రయాలు జరగవని వ్యాపారులు తెలిపారు. బుధవారం అమావాస్య కావడంతో మార్కెట్ యార్డు బంద్ ఉంటుందని పేర్కొన్నారు.

మత్తపదార్థాల నిర్మూలనకు సహకరించండి : ఎస్పీ