
పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
పాలమూరు: ఎంపీగా ఈ ఏడాదిలో పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఏడాది పాలన సంతృప్తినిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యామని, ఏడాదిలో రూ.562 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. జడ్చర్ల నుంచి రాయిచూర్ రోడ్ నాలుగు లైన్లుగా విస్తరించడానికి కేంద్రం అంగీకరించిందని, ఎన్‌హెచ్–44 6 లైన్లు అప్‌గ్రేడ్ చేశారని, కల్వకుర్తి హైవే పనులను ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించినట్లు చెప్పారు. నారాయణపేట మీదుగా ఎన్‌హెచ్–167 కర్ణాటక వరకు వెళ్లే రోడ్డు నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తామన్నారు. మెడికల్ కళాశాలల్లో వాటాలుగా నిధులు విడుదలలో కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. విద్యాపరంగా ఎన్నికల హామీ మేరకు ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, నవోదయ, సైనిక్ స్కూళ్లు తెచ్చుకున్నామన్నారు. అమృత్ స్టేషన్‌లలో భాగంగా పార్లమెంట్ పరిధిలో రూ.39.87 కోట్లతో మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్, మరో రూ.10.94 కోట్లతో జడ్చర్ల, రూ.9.59 కోట్లతో షాద్‌నగర్ రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కృష్ణ– వికారాబాద్ రైల్వేలైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మహబూబ్‌నగర్ మీదుగా వందేభారత్‌ను ప్రారంభించుకున్నట్లు వివరించారు. అనంతరం ‘వికసిత్ భారత్‌లో పాలమూరు నియోజకవర్గం’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
మేమూ బాధితులమే..
ఫోన్ ట్యాపింగ్‌లో తాము కూడా బాధితులమే అని ఎంపీ అరుణ పేర్కొన్నారు. దీనిపై సీబీఐతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, అందుకు కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా వెంటనే సీబీఐతో విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.