
ఇసుక క్వారీ అనుమతులు రద్దు
జడ్చర్ల: డార్క్ ఏరియాగా గుర్తించిన మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారు దుందుభీ వాగు పరివాహక ప్రాంతంలోని పట్టా భూముల్లో ఇచ్చిన ఇసుక క్వారీ అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. సదుద్దేశంతో ఇచ్చిన అనుమతులను క్వారీ నిర్వాహకులు దుర్వినియోగం చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, రవాణా చేయడంపై మంగళవారం ‘కొల్లగొడుతున్నారు’ శీర్షికన ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన టీజీఎండీసీ అధికారులు విచారించి అనుమతులను రద్దు చేయాలని సిఫార్సు చేయడంతో కలెక్టర్ గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాల అక్రమాలపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారించిన తర్వాత కలెక్టర్ అనుమతులను రద్దు చేయడంతో డార్క్ ఏరియా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లోనూ క్వారీ అనుమతుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డార్క్ ఏరియా రైతుల స్థితిగతులతోపాటు క్వారీ అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇసుక క్వారీ అనుమతులు రద్దు