ఆ బ్యాంకు ఉద్యోగి ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

ఆ బ్యాంకు ఉద్యోగి ఎక్కడ?

Jun 25 2025 1:29 AM | Updated on Jun 25 2025 1:29 AM

ఆ బ్య

ఆ బ్యాంకు ఉద్యోగి ఎక్కడ?

సహస్ర సోదరుడి మృతిపై అనుమానాలు..

తేజేశ్వర్‌ భార్య సహస్ర తమ్ముడి మృతిపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అక్క సహస్ర, తల్లి సుజాత వ్యవహారం గురించి పలుమార్లు సహస్ర తమ్ముడు హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ విషయం కూడా బ్యాంకు ఉద్యోగితో చెప్పడంతో పాటు రెండు నెలల క్రితం సహస్ర సొంత తమ్ముడిని సైతం హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే హత్య చేసి.. అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు నమ్మించారని తేజేశ్వర్‌ కుటుంబసభ్యులు సైతం ఆరోపిస్తున్నారు.

● ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ దారుణ హత్యకు ప్రధాన వ్యక్తిగా బ్యాంకు ఉద్యోగి తండ్రి ఏపీ పోలీసుశాఖ కర్నూలు జిల్లాలో ఏఎస్‌ఐగా పనిచేశారు. ఈ క్రమంలో భూ సంబంధ దందాలో ఉన్నట్లు అప్పటి ఉన్నతాధికారులు విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బ్యాంకు ఉద్యోగి తండ్రిపై రౌడీషీటర్‌ ఓపెన్‌ చేసినట్లు కర్నూలు పోలీసు రికార్డులు ఉన్నట్లు తేజేశ్వర్‌ కుటుంబసభ్యులు ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన నేపథ్యమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

గద్వాల క్రైం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేసినట్లు తెలిసింది. మంగళవారం విచారణ అధికారులు డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను కర్నూలు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడైన బ్యాంకు ఉద్యోగి తల్లిదండ్రులు, భార్యను వేర్వేరుగా రెండు గంటలకుపైగా విచారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హత్య, వివాహేతర సంబంధం విషయమై ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా.. వివాహేతర సంబంధం ఘటనలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయా.. తదితర అంశాలను ఆరా తీసినట్లు సమాచారం. తేజేశ్వర్‌ భార్య సహస్ర, ఆమె తల్లి సుజాతతో ఆర్థిక విషయాలను సైతం ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో తేజేశ్వర్‌ భార్య సహస్ర, తల్లి సుజాతలు పోలీసుల అదుపులో ఉండటంతో వారిని సైతం వారి ముందు పలు విషయాలను ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ప్రధాన నిందితుడి తండ్రి కర్నూలు జిల్లాలోని పోలీసు శాఖలో ఏఎస్‌ఐ స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసినట్లు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానిత వ్యక్తుల కుటుంబసభ్యులను సైతం పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు విచారణలో పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది.

నగదు మొత్తం విత్‌ డ్రా..

హత్య ఘటన అనంతరం ప్రధాన నిందితుడైన బ్యాంకు ఉద్యోగి సుఫారీ ఇచ్చిన వారికి రూ.2 లక్షలు అందజేసి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే తేజేశ్వర్‌ హత్యకు ముందే ప్రధాన నిందితుడు తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోంచి భారీ మొత్తంలో నగదు డ్రా చేసుకున్నట్లు తెలుస్తుంది. సుఫారీ ఇచ్చిన ముఠా సభ్యులను కలిసినప్పటి నుంచి తన కారులో హైదరాబాద్‌లోని తెలిసిన స్నేహితులు, బంధువులను కలిసి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు వినికిడి. అయితే పోలీసులు ముందుస్తుగానే ఎయిర్‌పోర్టు కార్యాలయానికి ప్రధాన నిందితుడికి సంబంధించిన వివరాలను చేరవేసి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం సైతం ప్రధాన నిందితుడు తెలుసుకుని హైదరాబాద్‌ శివారులో తెలిసిన వ్యక్తుల ఇళ్లలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

అరెస్టుకు ముందే న్యాయవాదులు

తేజేశ్వర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఎప్పటికై నా అరెస్టు కావడం ఖాయమని గుర్తించిన ప్రధాన నిందితుడు న్యాయ నిపుణుల సలహాలు సైతం తీసుకున్నట్లు తెలిసింది. అయితే మిస్సింగ్‌ కేసు నమోదు చేయగా.. తేజేశ్వర్‌ కుటుంబ సభ్యులు అనుమానిత వ్యక్తుల వివరాలలో బ్యాంకు ఉద్యోగి పేరు కూడా చెప్పడంతో విచారణ అధికారులు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకముందే.. బాం్యకు ఉద్యోగి తరఫున కర్నూలుకు చెందిన న్యాయవాదులు వచ్చి ఈ నెల 20వ తేదీన గద్వాల పోలీసుశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడడం గమనార్హం. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకముందే న్యాయవాదులు రావడంతో పోలీసులే కంగుతిన్నారు. కాగా.. హత్య విచారణకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. హత్య చేసిన ముఠా సభ్యులు మారణాయుధాలను ప్రవహించే నదుల్లో పారవేసినట్లు తెలుస్తుంది. తేజేశ్వర్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్‌ ఇతర వస్తువులను సైతం తుంగభద్ర లేదా కృష్ణానదిలో పడేసినట్లు భావిస్తున్నారు. కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా ఓ పథకం ప్రకారం ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

అంతా తారుమారు..

తేజేశ్వర్‌ను హత్య చేసి భార్య సహస్ర, బ్యాంకు ఉద్యోగి లడక్‌ లేదా ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు వివిధ కోణాల్లో ఆయా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీలు జరగకుండా బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేయడంతోపాటు విమానయాన కార్యాలయాలకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయడం, సహస్ర, ఆమె తల్లి సుజాత పోలీసుల అదుపులో ఉండడంతో కథ అంతా తారుమారైంది.

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసుల గాలింపు

దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నం...దీంతో లుక్‌ అవుట్‌ నోటీసు జారీ

అనుమానితుల కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు

నిందితుడి బ్యాంకు ఖాతాలు సీజ్‌

హైదరాబాద్‌లో ఉన్నట్లు అనుమానం

కీలక దశలో ఉంది..

తేజేశ్వర్‌ హత్య కేసు చాలా కీలక దశలో ఉంది. అయితే హత్యకు గల కారణాలు, హత్య చేసిన వారి వివరాలపై కూపీ లాగుతున్నాం. ఇప్పటి వరకు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. తాజాగా వారి కుటుంబసభ్యులను విచారించేందుకు పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు కోసం ఇప్పటికే పలు ప్రత్యేక బృందాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాయి. తెలంగాణలోనే తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలపై నిఘా ఉంచాం. దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశాం. బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశాం. త్వరలో కేసు వివరాలను వెల్లడిస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల

ఆ బ్యాంకు ఉద్యోగి ఎక్కడ? 1
1/1

ఆ బ్యాంకు ఉద్యోగి ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement