
అడవి పందులను వేటాడిన నిందితుల అరెస్ట్
నారాయణపేట క్రైం: జిల్లా సరిహద్దులోని జలాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి పట్టణ పోలీసుల ముమ్మర తనిఖీలో కర్ణాటకకు చెందిన ఓ బొలెరో వాహనంలో నాలుగు అడవి పందులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా, దేవదుర్గా తాలూకా భూమన కొండకు చెందిన 11మంది వేట కుక్కల సహాయంతో యానగుంది, దామరగిద్ద పరిసర ప్రాంతాల్లో పందులను వేటాడి కర్ణాటక దేవదుర్గాకు తరలిస్తుండగా నారాయణ పేట సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అప్పటికే అడవి పందులు వేటకుక్కల దాడిలో చనిపోయినట్లు తెలిపారు. వేటాడిన అడవి పందులను, వాటిని తరలిస్తున్న బొలెరో వాహనం, డ్రైవర్ అప్పన్నతో పాటు ఎల్లప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వ్యక్తులు పోలీసులను చూసి వేట కుక్కలతో సహ పారిపోయినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పందులకు వెటర్నరీ డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించి 12 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.