
న్యాయం చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటాం
అచ్చంపేట: ‘కొందరు స్వార్థం వల్ల మాకు అన్యాయం జరగతోంది. అధికారులు చేసిన తప్పులతో ఆర్థిక నష్టం జరుగుతోంది. మా గోడు అలకించి న్యాయం జరిగేలా చూడాలి’ అని ఎస్‌ఎల్‌బీసీలో భాగంగా నిర్మాణం చేపట్టిన నక్కలగండి రిజర్వాయర్ ముంపు గ్రామం కేశ్యతండా గ్రామస్తులు ఆర్డీఓ మాధవితో తమగోడును విన్నవించారు. మంగళవారం గ్రామానికి చెందిన యువకులు ఆర్డీఓను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. నక్కలగండి ప్రాజెక్టులో అచ్చంపేట మండలం మార్లపాడుతండా, కేశ్యతండా గ్రామాలకు చెందిన ప్రజల భూములు, ఇళ్లు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజల భూములకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించింది. దీంతో పాటు ముంపునకు గురవుతున్న మార్లపాడు, కేశ్యతండా గ్రామంలోని ఇళ్లకు సైతం నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇళ్లకు, ఖాళీ స్థలాలతో కలిపి గజం చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని నోటిఫికేషన జారీ చేశారు. 1989లో కేశ్యతండాకు చెందిన గిరిజనులకు ప్రభుత్వం 167 సర్వేనంబరులో 89 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసింది. రెవెన్యూ అధికారులు సదరు భూమికి సంబంధించి ఇళ్ల నిర్మాణం చూపకుండా అమ్మిన వ్యక్తిపై అదే భూమిని చూపించడం వల్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు నష్టపరిహారం రాకుండా పోతోంది. ప్రస్తుతం పక్కా ఇళ్లకు మాత్రమే పరిహారం వస్తుందని, ఖాళీ స్థలం, ఇంటిస్థలానికి పరిహారం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో నిర్మించిన ఇళ్ల స్థలాలను వ్యవసాయ భూమిగా, అది కూడా గతంలో భూమిని అమ్మిన వ్యక్తి వారసులుగా చూపించారు. దీని వల్ల తండావాసులు ఇళ్లకు మినహా, మిగతా ఖాళీ స్థలానికి నష్టం పరిహారం రావడం లేదు. దీని వల్ల తమకు సుమారు రూ.40 కోట్ల మేరా నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఇళ్లను మాత్రమే తమవిగా చూపించి, మిగతా స్థలాలను గతంలోని వ్యక్తి వారసులుగా చూపించడం వల్ల అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. వారసులమని చెప్పుకునే వారికి భూమి నష్టపరిహారం సొమ్ము రూ.22 లక్షలు వారి ఖాతాలో జమచేయడం సరైంది కాదని తెలిపారు. వారి నుంచి సొమ్ము రికవరీ చేసి తాము కొనుగోలు చేసిన ఇళ్ల స్థలం, ఇళ్లకు పరిహారం ప్రభుత్వం నిబంధనల మేరకు చెల్లించాలని కోరారు. దీని గురించి ఇప్పటికే అనేక మార్లు అధికారులను కలిసి విన్నవించామని, ఇప్పటికై నా న్యాయం చేయాలన్నారు. దీనిపై ఆర్డీఓ స్పందిస్తూ వీలైనంత త్వరగా గ్రామానికి వచ్చి మరోమారు సర్వే చేసి గ్రామస్తులకు న్యాయం చేస్తామని చెప్పారు. దీనిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని తహసీల్దార్ సైదులును ఆదేశించారు. దీంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించి నష్టపరిహారమివ్వాలి
ఆర్డీఓతో నక్కలగండి ముంపు ప్రజల గోడు