
11మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు
లింగాల: మండల కేంద్రానికి సమీపంలో ఓ వ్యవసాయ పొలంలో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 11మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో రూ.20, 020 వేల నగదు పట్టుబడగా మరో మూడు బైకులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పొలాల్లో పేకాడడం, మద్యం సేవించడం అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని, అంతేగాక పొలం యజమానులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు.
తేనెటీగల దాడి.. నలుగురికి గాయాలు
గండేడ్: తేనెటీగల దాడిలో నలుగురు మేకల కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మండలంలోని కొంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నేతి వెంకటయ్య, అమృతమ్మ, బాలమ్మ, నర్సమ్మ తమ మేకలను మేపడానికి వెంకటయ్య పొలానికి వెళ్లారు. వెంకటయ్య పొలం వద్ద చెట్లు కొడుతుండగా కొమ్మ విరిగి పక్కనే మరో చెట్టుపై ఉన్న తేనె తెట్టపై పడింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు లేచి వారి తల, ముఖాలపై కరిచాయి. కాసేపటికి అక్కడి నుంచి తేనెటీగలు వెళ్లిపోవడంతో గ్రామస్తులు వారిని ఆటోలో చికిత్స నిమిత్తం గండేడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అటు నుంచి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

11మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు