
జూరాలకు 43 వేల క్యూసెక్కులు
ధరూరు/ఆత్మకూర్: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు 7 క్రస్ట్‌గేట్ల తెరిచి 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 35,335 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 45, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 306, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 200, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.721 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు.
115.854 మి.యూ. విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో మంగళవారం ఉత్పత్తి కొనసాగినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 54.320 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 61.534 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ఇప్పటి వరకు 115.854 మి.యూ. ఉత్పత్తి జరిగిందని వివరించారు.
రామన్‌పాడులో 1,019 అడుగులు..
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికి పైన 1,019 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలకు 920 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. రామన్‌పాడు జలాశయం కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
కోయిల్‌సాగర్‌లో 18.6 అడుగులు..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయంలో మంగళవారం సాయంత్రం వరకు 18.6 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 8 అడుగులు నీరు వస్తే పాత అలుగుస్థాయికి నీచేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు.
7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
11 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి