
ప్రాణం తీసిన డ్రైవింగ్ సరదా
గట్టు: సరదాగా ట్రాక్టర్‌ను పొలం దాకా తీసుకెళ్దామనుకున్న సరదా చివరికి ఆ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన మంగళవారం గొర్లఖాన్‌దొడ్డి సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామానికి చెందిన వీరేశ్, బజారి స్నేహితులు. ఇద్దరు కలిసి మగ్గం(చేనేత) నేసేవారు. బజారి తన పొలంలో వరి నారును చల్లడానికి గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ట్రాక్టర్‌ను తీసుకొని పొలానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వరినారు బస్తాలను ట్రాక్టర్‌పై వేసుకుని గొర్లఖాన్‌దొడ్డి నుంచి తప్పెట్లమొర్సు వైపున్న రోడ్డుపై బయలుదేరాడు. మధ్యలో వీరేశ్ తాను వస్తానని, ట్రాక్టర్‌ను నడుపుతానని, చెప్పి ట్రాక్టర్‌పైకి ఎక్కి, డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. ట్రాక్టర్‌ను సరదాగా నడుపుకుంటూ వెళ్తుండగా.. కొంతదూరం వెళ్లిన తర్వాత కాల్వ ఉన్న చోటుకు చేరుకొగానే వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ను అదుపు చేసే క్రమంలో సడన్‌గా సింగిల్ బ్రేక్‌ను తొక్కడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌పై ఉన్న బజారి క్షణకాలంలో పక్కకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. ట్రాక్టర్ నడుపుతున్న వీరేశ్ (30) అక్కడిక్కడే మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు.

ప్రాణం తీసిన డ్రైవింగ్ సరదా