వితంతువులను చిన్నచూపు చూడొద్దు | - | Sakshi
Sakshi News home page

వితంతువులను చిన్నచూపు చూడొద్దు

Jun 24 2025 3:55 AM | Updated on Jun 24 2025 3:55 AM

వితంతువులను చిన్నచూపు చూడొద్దు

వితంతువులను చిన్నచూపు చూడొద్దు

నాగర్‌కర్నూల్‌: వితంతువులను చిన్నచూపు చూడకుండా ప్రతిఒక్కరిలోనూ మార్పు రావాలని, తమ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వితంతు మహిళలపై గౌరవంగా ప్రదర్శించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేతృత్వంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ బృందం సోమవారం నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అన్నిశాఖల జిల్లా అధికారులతో వితంతు మహిళా సంరక్షణ హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రథమంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొదటిసారిగా వితంతు మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వితంతు మహిళలు ఉన్నారని.. అందుకే వారి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో వితంతువుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. భర్తను కోల్పోయాక జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళల అభ్యున్నతికి పాటుపడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు. వితంతు మహిళల ప్రాథమిక హక్కులు, అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారని, అలాంటి వారి బాధలు, అనుభవాలపై దృష్టిసారించడంతోపాటు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కల్పిస్తున్న సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

వితంతువులు, వారిపై ఆధారపడినవారు ఎదుర్కొంటున్న సవాళ్లు, తరచుగా పేదరికం, సామాజిక వెలికితీత, హింస, వివక్షకు గురికాకుండా గుర్తించి కృషిచేయాలని సూచించారు. వితంతువులు కుటుంబాలను పోషించడానికి, కష్టపడుతున్నారని వారికి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో వితంతు మహిళలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ 5శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఈ సమావేశం నుంచే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. సమాజంలో వితంతు మహిళలు విద్య, ఆరోగ్య, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.

కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల అభ్యున్నతికి అమలు చేయనున్న పథకాలతో పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 13, 696 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, అందులో 1,47,123 మంది మహిళలు సభ్యులుగా నమోదై ఉన్నారని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 43, 703 మంది వితంతు మహిళాలకు అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా చేపట్టిన స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాల్లో 10శాంతం వితంతువులు ఉండేలా చూడాలని డీఆర్డీఓను కలెక్టర్‌ ఆదేశించారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద

వితంతు మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన

పాల్గొన్న కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌, అధికారులు

ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వితంతు మహిళల సామాజిక సంరక్షణ బాధ్యతలను పోలీస్‌ శాఖ సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. మహిళలపై అగౌరవంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీం ద్వారా ఇప్పటికే అనేక రకాల సమస్యలను పరిష్కరించామని, మహిళలు తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం, అదనపు ఎస్పీ రామేశ్వర్‌, మహిళా కమిషన్‌ కార్యదర్శి పద్మజస్వరూప, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి, డీఆర్డీఓ చిన్నఓబులేశ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ రామ్‌లాల్‌, సఖి కోఆర్డినేటర్‌ సునీత, మహిళలు, వితంతువులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement