భర్త మందలించాడని తెల్లారే సరికి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

భర్త మందలించాడని తెల్లారే సరికి అదృశ్యం

Jun 24 2025 3:55 AM | Updated on Jun 24 2025 3:55 AM

భర్త

భర్త మందలించాడని తెల్లారే సరికి అదృశ్యం

గోపాల్‌పేట: భర్త మందలించాడని మరుసటి రోజు తెల్లారేసరికి భార్య అదృశ్యమైన ఘటన రేవల్లి మండలంలోని తల్పునూరులో చోటుచేసుకుంది. మండలంలోని తల్పునూరుకు చెందిన ఉప్పరి రేణుక, దస్తగిరి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేసుకుని గ్రామంలోనే బతుకుతున్నారు. ఈనెల 14న సాయంత్రం 6గంటల ప్రాంతంలో రేణుక ఫోన్‌ మాట్లాడుతుండగా.. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావని భర్త మందలించాడు. ఆ తర్వాత ఎప్పటిలాగే ఇంట్లో అందరూ పడుకున్నారు. 15వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చూస్తే భార్య రేణుక కనిపించలేదు. అప్పటినుంచి గ్రామంలో తెలిసిన వారి ఇళ్లు, బంధువుల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం రేవల్లి పోలీస్‌స్టేషన్‌లో దస్తగిరి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై రజినీ వివరించారు.

మోకాళ్ల నొప్పులు.. అనారోగ్య సమస్యలతో..

ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం

లింగాల: మోకాళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు భరించుకోలేక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసున్నది. ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అల్లె బాలీశ్వరయ్య(58) మండలంలోని అప్పాయపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంటమనిషిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడు. సోమవారం డ్యూటీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మార్గమధ్యంలో అప్పాయపల్లి శివారులోని పలుగురాళ్ల గుట్ట వద్ద ఉరేసుకొన్నాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతుడి కుమారుడు బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఊర్కొండ: మండలంలోని కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై జిన్నింగ్‌ మిల్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి కిందపడి అనంతరెడ్డి(40) మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణదేవ కథనంప్రకారం.. నాగర్‌కర్నూల్‌ మండలం బొందలపల్లికి చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లిలో జూన్‌ 15 బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్‌పై వెళ్లి అక్కడే వదిలేశాడు. ఆదివారం తన చిన్నకుమారుడు శ్యాంసుందర్‌ రెడ్డి, పెద్దకుమారుడు అనంతరెడ్డి కలిసి తమ కొత్త వాహనంతో టీవీఎస్‌ ఎక్సెల్‌ను తాడుతో కట్టుకొని తీసుకొస్తున్నారు. అనంతరెడ్డి బైక్‌పైనుంచి అదుపు తప్పి కిందపడగా తలకు బలమైన గాయమైంది. 108లో కల్వకురి ఆస్పత్రి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుడి తల్లి కౌసల్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదని..

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

అయిజ: తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకన్న ఘటన అయిజ మున్సిపాలిటీలోని తుపత్రాలలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లా మలిగబాదాకు చెందిన కుర్వ జములమ్మ (26)కు తుపత్రాలకు చెందిన కుర్వ తిరుమలేశ్‌తో వివాహం చేశారు. జములమ్మ తండ్రికి ఇద్దరు భార్యలు. ఒక భార్య కూతురు జములమ్మ ఆస్తిలో తనకు సమాన వాటా కావాలని కోరింది. పెద్దమనుషుల సమక్షంలో రూ.10లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకొన్నారు. తర్వాత రూ.4లక్షలు మాత్రమే ఇస్తామని మాటమార్చడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతిచెందింది. ఘటనా స్థలాన్ని సీఐ టాటాబాబు, అయిజ ఎస్సై శ్రీనివాసరావు, మల్దకల్‌ ఎస్సై నందీకర్‌ పరిశీలించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

భర్త మందలించాడని తెల్లారే సరికి అదృశ్యం  1
1/1

భర్త మందలించాడని తెల్లారే సరికి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement