
నకిలీ విత్తనాలు విక్రయించిన ఇద్దరి రిమాండ్
నాగర్‌కర్నూల్ క్రైం: నకిలీ విత్తనాలు విక్రయించిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఆవంచలో గతనెల 30న నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తుల ఘటనపై ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మే 30న తిమ్మాజిపేట మండలం ఆవంచలో కనిక వెంకటయ్య ఇంట్లో 10కిలోల నకిలీ పత్తి విత్తనాలు పోలీసుల సోదాల్లో లభించడంతో అతడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా విచారించగా.. వెంకటయ్య అదే గ్రామంలోని పస్పరి వెంకటయ్య నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో జడ్చర్లలోని ఫర్టిలైజర్ దుకాణం నిర్వహించే వెంకట్‌నారాయణగౌడ్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించగా.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వెంకట్ నారాయణగౌడ్‌కు నకలీ పత్తివిత్తనాలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన సత్యకుమార్ నుంచి బ్లూడార్ట్ కోరియర్ ద్వారా తెప్పించుకుని రైతులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సత్యకుమార్‌ను గుజరాత్ నుంచి జడ్చర్లకు రప్పించి అదుపులోకి తీసుకుని విచారించగా‘‘ ఫ్రీడమ్ ’’ ప్రీమియమ్ హైబ్రిడ్ కాటన్ బ్రాండ్ పేరుతో మాక్స్‌జెని సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితులు వెంకట్‌నారాయణగౌడ్, సత్యకుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా నకలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కనకయ్యగౌడ్ ఉన్నారు.
వివరాలు వెల్లడించిన ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్