
భోజనం ఎలా పెడుతున్నారు..?
జడ్చర్ల టౌన్: ‘గురుకులంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. భోజనం ఎలా పెడుతున్నారు..’ అని కలెక్టర్ విజయేందిర విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. జడ్చర్ల– మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై మల్లెబోయిన్‌పల్లి గేట్ వద్ద ఉన్న తెలంగాణ గిరిజన బాలికల మినీ గురుకులంలో ఆదివారం పేరెంట్స్ సందడి కనిపించడంతో అటుగా వెళ్తున్న కలెక్టర్ గురుకులం వద్ద ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోనూ కలెక్టర్ మాట్లాడారు. ఎందుకు వచ్చారని తల్లిదండ్రులను అడిగారు. విద్యార్థులతో కొన్ని పాఠ్యాంశాలు చదివించి.. సామర్థ్యాలను పరిశీలించారు. కిచెన్‌ను పరిశీలించి అక్కడ చేస్తున్న వంటలు రుచి చూశారు. స్టోర్‌రూంలో నిల్వ ఉన్న వంట సరుకుల వివరాలు విచారించారు.
కాస్మొటిక్స్ డబ్బుల కోసం..
కాస్మొటిక్స్ డబ్బుల కోసం బ్యాంక్ ఖాతాలు అవసరం కాగా.. కొందరు విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో మినీ గురుకులం ప్రిన్సిపాల్ గిరిజ హౌజింగ్ బోర్డు కాలనీ ఎస్‌బీఐ అధికారులతో మాట్లాడి రప్పించారు. బ్యాంక్ అధికారులు వచ్చే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని వివరాలు తీసుకుని గురుకులానికి చేరుకున్నారు. ఇటు బ్యాంక్ అధికారులు సైతం అక్కడికి వచ్చి విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సందడి నెలకొనడంతో కలెక్టర్ దృష్టిపడింది. ఆదివారం అయినప్పటికీ విద్యార్థుల కోసం వచ్చిన బ్యాంక్ సిబ్బందిని, వారిని పిలిపించిన ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ అభినందించారు.
గిరిజన బాలికల మినీ గురుకులం
విద్యార్థినులతో కలెక్టర్ ఆరా