
పూలే దంపతుల జీవితం స్ఫూర్తిదాయకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రీబాయి దంపతుల జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బోయపల్లిలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జ్యోతిబాపూలే, సావిత్రీబాయి విగ్రహాలను ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. పూలే దంపతులు మహిళా విద్య, హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పిల్లలెవరూ ఇంట్లో ఉండకుండా పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని, అందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువ నిధులు తెప్పిస్తామన్నారు.
● విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు సూచించారు. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పీఆర్‌టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు కష్టతరమైన, క్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం నేర్పించాలన్నారు. అనంతరం అంబేడ్కర్ కళాభవన్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న ‘పాటల పల్లకీలో 12 గంటలు పాలమూరులో’ వాల్‌పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బెక్కరి అనిత, విగ్రహ దాతలు లక్ష్మీనారాయణ, వినోద్‌గౌడ్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, కవి– గాయకుడు నేర్నాల కిషోర్, టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు తదితరులు పాల్గొన్నారు.
బోయపల్లిలో పూలే
దంపతుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
తదితరులు