
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్‌సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు..
ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.
సీఎం సొంత గ్రామంలోనూ పర్యటన..
మాచారంలో ‘ఇందిరా సౌర జల వికాసం’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకోనున్నారు. గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఖర్చుతో ఇటీవల నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్‌తో నడిచే బోరు మోటారును ఆన్‌చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి తిలకిస్తారు.
11.35 గంటలకు గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి బయల్దేరుతారు.
1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
3 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

నేడు నల్లమలకు సీఎం రేవంత్