
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కౌకుంట్ల మండలం ముచ్చింతలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పెద్ద గొల్ల చంద్రన్న (56) ఇంటి ఎదుట ఉన్న కట్టెలు వర్షానికి తడవకుండా లోనికి తరలిస్తున్నాడు. అదే సమయంలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగ తెగి అతడిపై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రన్నకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఏఎస్‌ఐ వెంకటస్వామి వివరించారు.