
ఆర్టీసి బస్టాండ్‌లో వృద్ధుడి హఠాన్మరణం
వనపర్తి రూరల్: వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఎస్‌ఐ హరిప్రసాద్ వివరాల మేరకు.. పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌కు చెందిన కోటయ్య (60)కు ఆరోగ్యం బాగో లేకపోవడంతో మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి వెళ్లేందుకు శనివారం గ్రామం నుంచి వనపర్తికి చేరుకున్నాడు. అయితే బస్టాండ్ ప్రాంగణంలోని చలివేంద్రం వద్ద సిమెంట్ బెంచీ పక్కన కూర్చున్న అతడు.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే కోటయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
గోడ కూలి వ్యక్తి మృతి
ఊట్కూరు: మండలంలోని కొల్లూరులో ప్రమాదవశాత్తు గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన మాల చంద్రప్ప (55) శనివారం అదే గ్రామానికి మంగళి లక్ష్మమ్మ మట్టి ఇల్లు కూల్చివేత పనులకు వెళ్లాడు. ఇంటి గోడను కూలగొడుతున్న క్రమంలో ఒక్కసారిగా అతడిపై కూలి పడింది. గమనించిన స్థానికులు వెంటనే అత డిని శిథిలాల నుంచి బయటికి తీయగా.. అప్ప టికే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కృష్ణంరాజు తెలిపారు.
తండ్రితో డబ్బుల
వ్యవహారంలో గొడవ..
● కుమారుడి ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: డబ్బుల వ్యవహారంలో తండ్రితో గొడవ పడిన యువకుడు మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ కె.రాజు కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఏనుగొండకు చెందిన బాలకృష్ణ(21) ప్రైవేట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బుల విషయంలో శుక్రవారం రాత్రి తండ్రితో గొడవ జరగడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన బాలకృష్ణ ఏనుగొండ సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
చికిత్స పొందుతూ
వృద్ధుడి మృతి
అయిజ: మండలంలోని బింగుదొడ్డి గ్రామానికి చెందిన హనుమన్న (62) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు వివరాల మేరకు.. బింగుదొడ్డికి చెందిన హనుమన్న కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి రోడ్డుపక్కన అపస్మారక స్థితితో అతడు పడి ఉండటాన్ని బాటసారులు గుర్తించి 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
బావిలో పడి
యువకుడి మృతి
దేవరకద్ర: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. కౌకుంట్లకు చెందిన ఆనంద్‌కుమార్ (27) గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బహిర్భూమికి వెళ్లిన అతడు.. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాళం వేసిన
ఇళ్లకు కన్నం
దేవరకద్ర/మన్ననూర్: దేవరకద్రకు చెందిన శివ అనే వ్యక్తి తన భార్యను అత్తగారింట్లో వదిలిపెట్టడానికి శుక్రవారం వెళ్లాడు. తిరిగి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోగా.. అప్పటికే ఇంటికి వేసిన తాళం పగులగొట్టి కనిపించింది. ఇంట్లోని వస్తువలన్నీ చిందరవందరగా పడ్డాయి. ఇంట్లో దాచిన రూ. 2లక్షలు కనిపించకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన బాధితుడు.. శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగన్న ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
● అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఉన్న దాబా కాటేజీ నిర్వాహకుడు నరేశ్ బంధువుల వివాహం ఉండటంతో ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉంచిన 8 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ, 30వేల నగదు చోరీ చేశారు. కాగా, బుధవారం రాత్రి ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో తచ్చాడినట్లు సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైందని.. ఈ ఘటనపై అమ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.