
కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం..
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని పీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ ఇన్‌చార్జ్ సాంబయ్య అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. కార్యకర్తల కృషిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలందించే వారికి పదవుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, ఇతర పదవులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందరి సమష్టి నిర్ణయంతో పదవులను ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర సముచిత స్థానం కల్పిస్తామన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల ఎంపికలో పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి న్యాయం చేస్తామన్నారు.