
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
మన్ననూర్/కల్వకుర్తి టౌన్: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్టారావు, ఎంపీ మల్లురవి అన్నారు. అమ్రాబాద్ మండలం మాచా రంలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డిలతో కలిసి వారు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జలంధర్‌రెడ్డి ఇంటి వద్ద, కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మల్లు రవి మాట్లాడారు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభోత్సవంలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూడదని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే మాచారం గ్రామంలోని ఆదివాసీ చెంచుల ఊపిరీ తీయాలని చూస్తే.. నల్లమల బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని.. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నీతిమాలిన అసత్య గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విషయంలో ఏకాభిప్రాయంతో నడుస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి ఎజెండానే తమందరి ఎజెండా అని తెలిపారు. అత్యంత వెనకబడిన గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరి జల వికాసం పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 18న ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు నల్లమలకు రానున్నారని చెప్పారు.
● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో రూ. 12,600 కోట్లతో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ఆదివాసీలతో ప్రారంభమయ్యే ఈ పథకం.. ఎస్టీలలోని ఇతర వర్గాలతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుపేద కుటుంబాల్లోని రైతులకు కూడా వర్తింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. మాట తప్పం.. మడమతిప్పం అనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని తెలిపారు.
● ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో మరో భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 25కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మరో రూ. 75కోట్లు కేటాయించాలని సీఎంను కోరుతామన్నారు. సీఎం పర్యటనలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశాల్లో మాజీ జెడ్పీటీసీ డా.అనురాధ, పీసీబీ మెంబర్ బాలాజీ సింగ్, నాయకులు రాములు, రాజేందర్, శ్రీనివాసులు, మల్లేష్, ఆనంద్ కుమార్, విజయ్‌కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భూపతిరెడ్డి ఉన్నారు.