
ట్రాక్టర్ కిందపడి రైతు దుర్మరణం
తిమ్మాజిపేట: ట్రాక్టర్ కొనుగోలు చేసి పది రోజులు కూడా కాకముందే అంతలోనే అనంత లోకాలకు వెళ్లాడు రైతు. ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కిందపడి రైతు మృతి చెందిన సంఘటన తిమ్మాజిపేట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని బావాజిపల్లికి చెందిన బత్తుల బాలస్వామి(48) వ్యవసాయ పనుల కోసం ఇటీవల నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. తన సొంత వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. పొలం దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్ పొలం ఒడ్డు ఎక్కి అదుపుతప్పి బాలస్వామిపై బోల్తాపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దగ్గర పొలంలో ఉన్న రైతు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని జేసీబీతో ట్రాక్టర్‌ను తొలగించగా అప్పటికే మృతి చెందాడు. హుటాహుటిన మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి భార్య రేవతమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమార్తె వివాహం చేశాడు. బాలస్వామి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కుమ్మెర శివారులో చోటు చేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలంలోని వసంతాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ (44) భర్త నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో కుమ్మెర శివారులోని కేఎల్‌ఐ కాల్వ వద్ద మృతి చెంది ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రాములమ్మ మృతి చెంది రెండు రోజులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటం, శరీరంపై బట్టలు సరిగా లేకపోవడంతో ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి మృతురాలి అన్న చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
బావిలో మృతదేహం లభ్యం
బిజినేపల్లి: మండలంలోని పాలెం గ్రామానికి చెందిన అయ్యగారి బావిలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు (56) మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు శ్రీనివాసులు కోసం తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా బుధవారం ఉదయం అయ్యగారి బావి సమీప రైతులు బావిలోని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావి నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
డ్రెయినేజీలో పడి
వ్యక్తి మృతి
పాన్‌గల్: మండల కేంద్రం పాన్‌గల్‌లో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఎస్‌ఐ హిమాబిందు తెలిపిన వివరాల ప్రకారం.. పాన్‌గల్‌కు చెందిన వడ్డె శివయ్య(51) కుటుంబం హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 7న భార్యతో కలిసి స్వగ్రామం పాన్‌గల్‌కు వచ్చారు. అయితే ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లినా శివయ్య కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో బుధవారం గ్రామంలోని వైన్ షాపు సమీపంలో ఉన్న డ్రెయినేజీలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. శివయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వృద్ధుడి మృతిపై
కేసు నమోదు
ఉండవెల్లి: మండలంలోని చిన్న ఆముదాలపాడు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి(65) అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య గమనించి అంబులెన్స్‌లో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

ట్రాక్టర్ కిందపడి రైతు దుర్మరణం