
కనులపండువగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవం సోమవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల మధ్య స్వామివారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. ముందుగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ ఆలయం ముందు గల మైదానంలో పూల అలంకరణతో తయారు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. కల్యాణ తంతులో భాగంగా జీలకర్ర బెల్లం తదితర పూజల అనంతరం అమ్మవారికి మంగళసూత్రధారణ గావించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవతామూర్తులకు పట్టువస్త్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య దేవతామూర్తుల దంపతులు ధగధగా మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకలను కనులారా తిలకించి పునీతులయ్యారు. చాలామంది దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకోవడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు దేవస్థానం తరఫున వారి చేతులకు పసుపు కొమ్మలను ధరింపచేశారు. కల్యాణోత్సవం అనంతరం ఈ దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ మండపం నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలా మంది దేవస్థానంలో కూడా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేశారు.
ఘనంగా గరుడవాహన సేవ
శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి స్వామివారి గరుడ వాహన సేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన గరుడవాహనంపై స్వామి దంపతులను ఉంచి ఊరేగించారు. గర్బగుడి నుంచి దేవస్థానం ముందున్న కమాన్ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తుల హరినామస్మరణ, పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు, కాగడాల వెలుతురులో స్వామివారి సేవ ముందుకు కదిలింది. స్వర్ణాభరణ అలంకరణలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవతా మూర్తులు గరుడవాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ పవిత్రసేవను చూసి భక్తులు తరించారు. స్వామివారి నామస్మరణతో మన్యంకొండ గిరులు మార్మోగాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మన్యంకొండ దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, శంకర్, గోవింద్, ఆంజనేయులు, అలివేలు, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, రవీందర్, రంగయ్య, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
వైభవంగా గరుడవాహన సేవ
స్వామివారి నామస్మరణతో మార్మోగిన మన్యంకొండ